ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా విమర్శలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వారం రోజుల క్రితం పవన్ చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ఆలస్యంగా తెరపైకి తీసుకురావడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందించగా, తరువాత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ వంటి నేతలు విమర్శలు చేశారు. ఆలస్యంగా స్పందించడం, అదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏపీ ప్రభుత్వంతో సఖ్యతగా ఉన్న సమయంలో ఇలా జరగడం కాంగ్రెస్ కోవర్టుల ఆపరేషన్ అయి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా, ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోవడానికి పవన్ కృషి చేసిన నేపథ్యంలో, జగన్ అభిమానులు కొందరు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఉండి అసహనంతో ఈ విమర్శలకు దిగుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ విమర్శల వల్ల కాంగ్రెస్ పార్టీకే నష్టం జరిగే ప్రమాదం ఉందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.

