పేదరికానికి, ఆకలికి కులం ఉండదు, అందరి సమస్యే. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం, యు.కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో రేషన్ బియ్యం పంపిణీలో దారుణమైన రాజకీయాలు, వివక్ష చోటుచేసుకున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మూలపేట గ్రామంలోని షాప్ నంబర్ 27, 28, 47కు సంబంధించిన కొందరు లబ్ధిదారులకు 50 కిలోల బియ్యం పంపిణీ చేయగా, అదే గ్రామానికి చెందిన మరికొన్ని కులాల వారికి మాత్రం 25 కిలోల బియ్యం మాత్రమే పంపిణీ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ వివక్షపై ఆగ్రహం వ్యక్తంచేసిన శెట్టిబలిజ, దళిత, నాయా బ్రాహ్మణ, యాదవ సహా మరికొన్ని కులాలకు చెందిన లబ్ధిదారులు తమకు అన్యాయం జరిగిందంటూ సంబంధిత రేషన్ దుకాణాల ఎదుట తీవ్ర ఆందోళనకు దిగారు. కులం ఆధారంగా బియ్యం పంపిణీలో తారతమ్యం చూపడం దారుణమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. అందరికీ సమానంగా 50 కిలోల బియ్యం పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
స్థానికంగా అధికార పార్టీకి లేదా రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే ఎక్కువ బియ్యం ఇచ్చి, మిగిలిన వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పేదల కడుపు కొట్టే ఇలాంటి వివక్షపై అధికారులు తక్షణమే స్పందించి, అందరికీ సమానంగా బియ్యం పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో కుల రాజకీయాలు, వివక్ష చోటుచేసుకోవడం పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి, పేదల ఆకలి తీర్చేందుకు సరైన న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.

                                    
