జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ను విజయవంతం చేయాలని జనసేన నాయకులకు, కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. టెలీకాన్ఫరెన్స్ ద్వారా జనసేన ఎమ్మెల్యేలు, జన సైనికులతో మాట్లాడిన ఆయన, సినిమాకు మద్దతుగా నిలవాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే మూడుసార్లు నాదెండ్ల మనోహర్ జనసేన నేతలతో ఈ విషయంపై టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
నాదెండ్ల మనోహర్ చేసిన ముఖ్య విజ్ఞప్తులు
జనసైనికులు డబ్బులు పెట్టి టిక్కెట్లు కొని సినిమా చూడాలని, ఇతరులకు కూడా సినిమా చూసేలా చేయాలని మనోహర్ కోరారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడానికి కూటమి నేతల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు. ‘హరిహర వీరమల్లు’కు నెగటివ్ టాక్ వస్తోందని, దాన్ని మార్చడానికి వారం రోజుల పాటు సినిమాకు మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తగ్గకుండా ఉండాలంటే అందరూ సినిమా చూడాలని, మరో ఐదు రోజులు ఈ సినిమాను అందరూ చూసేలా చేయాలని తెలిపారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లోకి వెళ్లే అవకాశం దొరుకుతుందని, గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులంతా సినిమా కోసం పనిచేయాలని ఆదేశించారు. ప్రతి థియేటర్‌కి వెళ్లి కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఆరా తీయాలని, అందరినీ సినిమాకు తీసుకొచ్చే బాధ్యత జనసైనికులదేనని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. డబ్బులు లేనివారికి డబ్బులు ఇచ్చి సినిమా చూపించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ సినిమాను విజయవంతం చేయడానికి జనసేన శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశించిన నేపథ్యంలోనే ఈ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు సమాచారం.