కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పిటిసి స్థానాలకు ఉప ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. సాధారణంగా ఈ స్థాయి ఎన్నికలు పెద్దగా ప్రాధాన్యం పొందకపోయినా, ప్రస్తుతం టిడిపి – వైసిపి మధ్య ప్రతిష్టాత్మక పోరాటంగా మారాయి.
పులివెందులలో వైసిపి నుంచి హేమంత్ రెడ్డి, టిడిపి నుంచి మా రెడ్డి లతా రెడ్డి బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో వైసిపి అభ్యర్థి సుబ్బారెడ్డి, టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణ రెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. రెండు పార్టీలు విస్తృత ప్రచారం నిర్వహించడంతో పాటు ఆర్థిక ప్రలోభాల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జగన్ సొంత జిల్లా కావడంతో టిడిపి ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించి వైసిపి బలహీనతను ప్రజల్లో చూపించాలని చూస్తుండగా, వైసిపి ప్రతిష్టను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికలు 12వ తేదీన, ఫలితాలు 14న వెలువడనున్నాయి.
ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.