తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రజల ఆశల ప్రాజెక్ట్ అయిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిలిపివేతపై ఆయన చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
తెలంగాణ ప్రయోజనాలే పరమావధిగా తాను పనిచేస్తున్నానని చెబుతూ, రాయలసీమ ప్రాజెక్ట్‌ను అడ్డుకుంది తానేనని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో తాను స్వయంగా మాట్లాడానని, సీమ ప్రాజెక్ట్ పనులు ఆపకపోతే ఏ విషయంలోనూ సహకరించబోమని స్పష్టం చేశానని ఆయన వెల్లడించారు. “రాయలసీమ ప్రాజెక్ట్ ఆపితేనే ఏ చర్చలకైనా వస్తామని చెప్పాను.. అందుకే ఆపేశారు” అని రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బాంబులా పేలాయి.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షాలు మరియు నెటిజన్ల నుంచి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతానికి జీవనాడి వంటి ప్రాజెక్ట్‌ను, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కోరగానే ఎలా నిలిపివేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేవలం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాల కోసం లేదా రాజకీయ వ్యూహాల కోసం రాయలసీమ రైతుల ప్రయోజనాలను చంద్రబాబు బలి ఇచ్చారా? రేవంత్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం పట్టుబట్టడం సహజమే కావచ్చు, కానీ చంద్రబాబు ఎందుకు వెనక్కి తగ్గారు? ఇది రాయలసీమకు చేస్తున్న అన్యాయం కాదా? అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రేవంత్ రెడ్డి దీన్ని ఒక విజయంగా చెప్పుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం దీనిపై మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
“ఒక ముఖ్యమంత్రి తన ప్రాంత ప్రాజెక్టుల కోసం పోరాడాల్సింది పోయి, పక్క రాష్ట్ర సీఎం ఒత్తిడికి తలొగ్గి పనులు ఆపేయడం దురదృష్టకరం” అని రాయలసీమ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు నీటి కోసం అల్లాడుతున్న సీమకు ఇది పెద్ద దెబ్బ అని వారు అభివర్ణిస్తున్నారు.రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ప్రకటనతో చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య సయోధ్యకు నిదర్శనమా లేక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పక్కన పెట్టి చేస్తున్న రాజకీయమా అనేది కాలమే నిర్ణయించాలి.


