జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, రచయిత రేణు దేశాయ్ సన్యాసంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా ఆధ్యాత్మికత, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ, తనకు పిల్లలే మొదటి ప్రాధాన్యత అని, సన్యాసం తీసుకోవడంపై కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.
తాను సన్యాసం తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం ఆ ఆలోచన లేదని, తన దృష్టి అంతా తన పిల్లలు అకిరా నందన్, ఆద్య పైనే ఉందని ఆమె తేల్చి చెప్పారు.
“నేను ఇప్పుడే సన్యాసం తీసుకోను. నాకు ఫస్ట్ పిల్లలు ముఖ్యం. ఆ తర్వాతే దేవుడు. ఇప్పుడు నా వయసు 45. నాకు ఇంకా పిల్లల బాధ్యత ఉంది. వారికి నేను అండగా ఉండాలి. అందుకే ఇప్పుడైతే సన్యాసం వైపు వెళ్లే ఆలోచన లేదు.” అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.
అయితే, భవిష్యత్తులో సన్యాసం తీసుకునే అవకాశాన్ని రేణు దేశాయ్ కొట్టిపారేయలేదు. పిల్లలు స్థిరపడిన తర్వాత, జీవిత చరమాంకంలో ఆ వైపు మొగ్గు చూపుతానని ఆమె సంచలన ప్రకటన చేశారు. “65 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుంటాను” అని ఆమె స్పష్టం చేశారు.
45 ఏళ్ల వయసులో ఉన్న ఆమె, పిల్లల భవిష్యత్తు, బాధ్యతలు పూర్తయిన తర్వాతే తన జీవితాన్ని పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితం చేస్తానని చెప్పడం రేణు దేశాయ్ వ్యక్తిత్వంలో పరిణతిని చూపిస్తోందని అభిమానులు అంటున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తో విడిపోయాక.. విడాకులు తీసుకున్నాక రేణుదేశాయ్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. పిల్లల బాగోగులు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమె వైరాగ్యంతో సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.


