వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి మళ్లీ చర్చల్లోకి వచ్చారు. మీడియా రంగంలో కెరీర్ ప్రారంభించిన ఆయన, జగన్‌మోహన్ రెడ్డి ప్రారంభించిన సాక్షి మీడియాలో కీలక బాధ్యతలు చేపట్టడం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయ్యారు. తరువాత రాజకీయాల్లోకి ప్రవేశించి, పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారారు.
ఇటీవల సజ్జల కుమారుడు భార్గవరెడ్డికు కూడా కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. సాక్షి మీడియా డిజిటల్ కంటెంట్ విభాగానికి ఆయనను ఇన్‌ఛార్జ్‌గా నియమించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాక్షి బాధ్యతలు వైయస్ భారతి రెడ్డి చూసుకుంటుండగా, భార్గవరెడ్డి ఆమెకు సహాయకుడిగా వ్యవహరించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తరువాత సజ్జల ప్రభావం తగ్గుతుందని భావించినా, జగన్ ఆయనపై నమ్మకం కొనసాగించటం గమనార్హం. అంతేకాదు, ఆయనకు రాష్ట్ర సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించడం ద్వారా తన విశ్వాసాన్ని మరొక్కసారి చాటిచెప్పారు.
ఇక సజ్జల కుటుంబం మళ్లీ పార్టీ, మీడియా రంగాల్లో ప్రాధాన్యత సాధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చూడాలి మరి.. ఈ కొత్త సమీకరణలు వైసీపీ భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతాయో.

                                    
