కాశిబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ.. టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారితీశాయి. “ఇది ప్రభుత్వ వైఫల్యం కాదు.. చంద్రబాబు బాగా చేస్తోన్నాడు.. బయట కూర్చొని విమర్శలు చేయకుండా ఏపీకి వచ్చి మాట్లాడండి” అంటూ టీవీ లైవ్ డిబేట్‌లో సవాల్ విసిరారు. అంతటితో ఆగకుండా, విమర్శకులపై “కుక్కలు” అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించడం ఆగ్రహం రేకెత్తించింది.
సోషల్ మీడియాలో సాంబశివరావుపై నెటిజన్లు మండిపడుతున్నారు. “ప్రజల ప్రాణాలు పోయిన ఘటనను కూడా రాజకీయంగా కప్పిపుచ్చడమేంటీ?” అని ప్రశ్నిస్తున్నారు. వీడియోను విస్తృతంగా షేర్ చేస్తూ కౌంటర్లు వేస్తున్నారు. ముఖ్యంగా రెండు ప్రశ్నలతో నెటిజన్లు సాంబశివరావును నిలదీస్తున్నారు. “కుక్కల డాక్టర్ గురించి మాట్లాడావు.. కుక్కలు ఫ్రస్ట్రేట్ అవ్వాలి కానీ, నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు సాంబశివరావు గారు? ప్రపంచంలో ఎక్కడైనా ప్రభుత్వ దేవుళ్లు, ప్రైవేట్ దేవుళ్లు ఉంటారా? ప్రభుత్వ నిర్వహణలో జరిగిన ప్రమాదం ప్రభుత్వ బాధ్యత కాదా?” అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
కాశిబుగ్గ ఘటనలో జరిగిన దుర్ఘటనపై విచారణ జరుగుతుండగా, మీడియా ప్రతినిధులు బాధితుల పక్షాన నిలబడాల్సిన సందర్భంలో.. ఒక యాంకర్ పాలిటికల్ షీల్డుగా మారడం ప్రజలకు బాధ కలిగిస్తోంది.
“ప్రజల ప్రాణాలకంటే పెద్ద రాజకీయాలు లేవు” అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, మీడియా సంస్థలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని నెటిజన్లు కోరుతున్నారు.


