ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో కూరుకుపోతున్న తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి మంగళవారం ఆర్‌బీఐ ద్వారా సెక్యూరిటీల వేలం వేస్తూ విచ్చలవిడిగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు, ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, వచ్చే మంగళవారం మరో రూ.3,000 కోట్లు అప్పు చేయనున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్‌బీఐ) నోటిఫై చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనుంది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.సంపద సృష్టిస్తానని చెప్పి, వారం వారం వేల కోట్లు అప్పులు చేస్తున్నావ్ కదయ్యా… చంద్రబాబు?” అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం మూడు నెలల్లోనే వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేసి, రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారనే ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్రంలో పన్నుల ద్వారా, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం కంటే ఖర్చు రెట్టింపు అవుతోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయకుండానే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ప్రతి మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా అప్పులు…బడ్జెట్‌లో చూపిన అప్పులతో పాటు, కార్పొరేషన్ల పేరుతో బడ్జెట్ బయట కూడా అప్పులు… సంపద సృష్టి మాట దేవుడెరుగు, ప్రజలపై అప్పుల భారం మోపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. .
రాష్ట్రంపై ఇప్పటికే లక్షల కోట్ల అప్పుల భారం ఉండగా, ప్రతీ వారం కొత్త అప్పులు చేయటం, రాష్ట్ర భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

