రాజకీయ ఒత్తిళ్లు, ప్రభుత్వ అవమానాల మధ్య చివరికి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన పదవికి గుడ్‌బై చెప్పారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ (అడ్మిన్)గా పని చేస్తున్న ఆయన, స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ (VRS) కోసం ప్రభుత్వానికి అధికారికంగా దరఖాస్తు చేసినట్లు పోలీసు శాఖ వర్గాలు వెల్లడించాయి.
గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సిద్ధార్థ్… ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐపీఎస్ అధికారులపై జరుగుతున్న ‘రెడ్ బుక్’ వేధింపుల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని తెలుస్తోంది. ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసిన ఆయన గత నెల నుంచి విధులకు కూడా హాజరు కావడం లేదు.
పోలీసు వర్గాల్లో విస్తృత చర్చనీయాంశంగా మారిన ఈ పరిణామం రాజకీయ దుమారానికి దారితీసే అవకాశముంది. ఇప్పటివరకు 24 మంది ఐపీఎస్ అధికారులను విధుల్లోకి తీసుకోకుండా వేయిటింగ్‌లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం, పలువురు సీనియర్ అధికారులకు ప్రాధాన్యం లేని పోస్టింగ్‌లు ఇచ్చిన తీరు విమర్శలకు దారితీస్తోంది.
ఈ క్రమంలోనే ఐజీ వినీత్ బ్రిజాలాల్ కేంద్ర సేవలకెళ్లడం, పీఎస్ఆర్ అంజనేయులు, పీవీ సునీల్ కుమార్, టి.కాంతిరాణా, విశాల్ గున్నీ వంటి అధికారులపై సస్పెన్షన్‌లు, కేసులు నమోదవ్వడం పోలీసు శాఖలో అశాంతి వాతావరణాన్ని తెచ్చినట్లు వర్గీయులు చెబుతున్నారు.
సిద్ధార్థ్ కౌశల్ వీఆర్ఎస్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఆయన ఢిల్లీలోని ఒక ప్రముఖ కార్పొరేట్ కంపెనీలో చేరనున్నారని సమాచారం. ప్రస్తుతం పోలీస్ శాఖలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నుంచి బయటపడటానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని నమ్మకంగా చెబుతున్నారు.