ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మద్యం కుంభకోణం కీలక పరిణామాలకు దారితీస్తోంది. ముఖ్యంగా కీలక అరెస్టులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు సమాచారం. మద్యం కుంభకోణంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు డిస్మిస్ చేయడంతో ఆయన అరెస్ట్‌కు మార్గం సుగమమైంది. ప్రస్తుతం మిథున్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు కేంద్రం ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గాలిస్తోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆయన అరెస్టు తప్పదని తెలుస్తోంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ జాబితాలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేరనున్నారు.
కేసు నేపథ్యం:
మద్యం కుంభకోణంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన సమయంలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అయితే తనకు ఈ కేసుతో కనీసం సంబంధం లేదని, అయినా సరే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పట్లో అజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నారు. అయితే తాము ఎఫ్‌ఐఆర్‌లో కనీసం మిథున్ రెడ్డి పేరు చేర్చలేదని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక దర్యాప్తు బృందం స్పష్టం చేసింది. అయితే, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్‌కు తొందరపడవద్దని, ఆయన విచారణకు సహకరిస్తారని అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో స్పష్టం చేసింది.
అయితే, మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆధారాలతో సహా నిరూపించడానికి ప్రయత్నించింది. హైకోర్టు మిథున్ రెడ్డిపై చర్యలు వద్దని సూచించడంతో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఎటువంటి పరిశీలన చేయకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని ఏపీ ప్రభుత్వం వాదించగా, మరోసారి బెయిల్ పిటిషన్ పరిశీలించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ప్రత్యేక దర్యాప్తు బృందం అన్ని ఆధారాలు సమర్పించడంతో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు:
తుది ప్రయత్నంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అజ్ఞాతంలో ఉంటూనే సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. అయితే, తుది దశలో విచారణ, పక్కా ఆధారాలు ఉండటంతో బెయిల్ ఇవ్వలేమని చెప్పి పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఏ క్షణమైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని తెలుస్తోంది. ఆయన కోసం సిట్ గాలింపు చర్యలు ముమ్మరం చేసింది.