ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జనాభా పెంపుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పిల్లలను కనమని ప్రజలకు పిలుపునిచ్చిన ఆయనకు, ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. “పిల్లలను కనాలంటే ఆర్థిక స్థిరత్వం అవసరం. మరి ఈ విషయంలో మీరు ఎలా ముందుకు వెళ్తారు?” అని ఆ లేడీ డాక్టర్ సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పలేక నవ్వులపాలయ్యారని, దీనిపై త్వరలో జనాభా నిర్వహణ పాలసీ తీసుకొస్తామని ప్రకటించారని వార్తలు వెలువడ్డాయి.
ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రజా జీవితానికి సంబంధించిన ఇంతటి కీలక అంశంపై స్పష్టమైన విధానం లేకుండా మాట్లాడటం ఆయన పరిపాలనా దక్షత దార్శనికత పై సందేహాలను లేవనెత్తుతోంది. ప్రజలకు ఒక సూచన చేసే ముందు, దాని సామాజిక, ఆర్థిక పరిణామాలపై లోతైన అధ్యయనం, ప్రణాళిక ఉండాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి సందర్భాల్లో నాయకులు ప్రజల ముందు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి తలెత్తుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
జనాభా నిర్వహణ అనేది కేవలం పిల్లలను కనమని చెప్పడం కాదు, పుట్టిన పిల్లలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు కల్పించడం, తద్వారా సమాజంలో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ అంశంపై ప్రజల నుంచి, నిపుణుల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఈ సూచనల ఆధారంగా ఎలాంటి సమగ్ర విధానాన్ని రూపొందిస్తారో చూడాలి.