తిరుమలలో ప్రజాప్రతినిధులు, టీటీడీ సిబ్బంది మధ్య వాగ్వాదాలు నిత్యకృత్యంగా మారాయి. తాజాగా తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ ఎమ్మెల్యే కోరుగొండ్ల రామకృష్ణ టీటీడీ సిబ్బందితో గొడవకు దిగడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటన గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం అనంతరం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఎమ్మెల్యే రామకృష్ణ తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం బయటకు వెళ్లే క్రమంలో మహా ద్వారం ఎదురుగా ఉన్న గేటు వద్దకు చేరుకున్నారు. గేటు తీయాల్సిందిగా ఆయన అక్కడున్న టీటీడీ ఉద్యోగిని కోరారు. అయితే, ఆ గేటు నుంచి ఎవరినీ అనుమతించవద్దని ఉన్నతాధికారులు ఆదేశించిన విషయాన్ని ఉద్యోగి ప్రస్తావించారు. భక్తులు అందరూ పుష్కరిణి వైపు ఉన్న మార్గం గుండా బయటకు వెళ్లాలని సూచించారు.
దీంతో ఎమ్మెల్యే రామకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయారు. మరోసారి గేటు తీయాలని ఆదేశించినా ఉద్యోగి నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పరిస్థితిని గమనించిన భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని సర్దిచెప్పి, ఎమ్మెల్యేను సూచించిన మార్గం గుండానే పంపించారు.
గతంలో కూడా తిరుమలలో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ముఖ్యంగా మహాద్వారం వద్ద గేటు తీసే విషయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో బెంగళూరుకు చెందిన ఓ టీటీడీ పాలకమండలి సభ్యుడు, టీటీడీ ఉద్యోగి మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైంది. వాస్తవానికి, మహా ద్వారం ఎదురుగా ఉన్న గేటు నుంచి బయటకు ఎవరినీ అనుమతించవద్దని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దిగువ స్థాయి సిబ్బంది ఈ ఆదేశాలను పాటిస్తున్న క్రమంలోనే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి సందర్భాల్లో టీటీడీ అధికారులు ప్రజాప్రతినిధులకు సర్దిచెప్పడం పరిపాటిగా మారింది. అధికారుల ఆదేశాలతోనే తాము ఇలా చేస్తున్నామని, కానీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురవుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.