ప్రముఖ తెలుగు వార్తా సంస్థ టీవీ5 యాంకర్ సాంబశివరావు తాజాగా గాంధీ కుటుంబంపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. ఒక చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గాంధీ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విమర్శలకు కేంద్రబిందువుగా మారాయి.
చర్చా గమనంలో సాంబశివరావు గాంధీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివాహ బంధాల గురించి ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “గాంధీ కుటుంబంలో హిందువులను పెళ్లి చేసుకొని చాలా కాలమైంది” అని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా, చారిత్రక ఉదాహరణలను ఉటంకిస్తూ “రాజులకు, సైన్యాధిపతులకు విదేశీ మహిళలతో సంబంధాలు ఉండకూడదు. అదే దేశంలో కాంగ్రెస్ పతనానికి ప్రధాన కారణం” అంటూ ఘాటుగా విమర్శించారు.ఒక జాతీయ పార్టీ అగ్ర నాయకత్వంపై, వారి వ్యక్తిగత జీవితాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నైతికంగా సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి గారు ఈ వ్యాఖ్యలను అడ్డుకోకపోవడంపై కూడా నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తులసిరెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారని, ఆ కారణం చేతనే ఆయన టీవీ5 యాంకర్ వ్యాఖ్యలను గట్టిగా ఖండించలేకపోయారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తన సొంత పార్టీ అధినాయకత్వంపై అంతటి వ్యక్తిగత దాడులు జరుగుతున్నా ఆయన మౌనంగా ఉండటం కాంగ్రెస్ కార్యకర్తలకు మింగుడుపడటం లేదు.
ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

