అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల సార్వభౌమాధికారంపై ఆయన చూపిస్తున్న ఆధిపత్యంపై టీవీ5 సాంబశివరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లైవ్ చర్చా కార్యక్రమంలో ఆయన అడిగిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
అమెరికా అగ్రరాజ్యం అయినంత మాత్రాన, ప్రపంచంలోని అన్ని దేశాలపై ఆధిపత్యం చెలాయించడం ఎంతవరకు సమంజసమని సాంబశివరావు ప్రశ్నించారు. కేవలం తన మాట వినలేదన్న సాకుతో ఇతర దేశాల ప్రధానులను, నాయకులను లాక్కురావాలని చూడటం ట్రంప్ అహంకారానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు.భారత ప్రధాని నరేంద్ర మోదీపై కూడా సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. “మోదీ గారు ట్రంప్ సంతోషం కోసం పనిచేయాలా? లేక తనకు ఓట్లు వేసి గెలిపించిన 140 కోట్ల మంది భారతీయుల కోసం పనిచేయాలా?” అని నిలదీశారు. మన దేశ ప్రయోజనాలు, సార్వభౌమత్వం ముఖ్యం తప్ప, అమెరికా మెప్పు కాదని స్పష్టం చేశారు. భారతదేశం ఒక స్వతంత్ర దేశమని, మన దేశ గౌరవాన్ని కాపాడటం కోసం మోదీ కఠిన నిర్ణయాలు తీసుకుంటే అందులో తప్పేముందని ఆయన సమర్థించారు. అదే సమయంలో అమెరికా ఒత్తిళ్లకు లొంగిపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.
చర్చా క్రమంలో మరింత ఆవేశానికి లోనైన సాంబశివరావు, “ఇకపై భగవంతుడు కూడా ట్రంప్‌ను కాపాడలేడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అనుసరిస్తున్న విపరీత ధోరణులే ఆయనకు ముప్పుగా మారుతాయని హెచ్చరించారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా పెత్తనాన్ని ప్రశ్నిస్తూ సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. అగ్రరాజ్యం ఒత్తిళ్లను తట్టుకుని భారతదేశం తన స్వయంప్రతిపత్తిని ఎలా కాపాడుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


