జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీ సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గ్రీవెన్స్ సెల్‌లో తన సమస్యను వివరించి, న్యాయం చేయాలని, తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాలని ఆమె కోరింది. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి తన వేదనను వ్యక్తం చేసింది.
అయితే, ఈ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. రాజస్థాన్ పోలీసులు ఆకస్మికంగా ప్రెస్ క్లబ్ సమీపానికి చేరుకుని లక్ష్మీని అరెస్ట్ చేశారు. జైపూర్‌లో ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. కేవలం రాజస్థాన్‌లోనే కాదు, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆమెపై బ్లాక్‌మెయిల్, మోసం కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
గత కొన్ని నెలలుగా పోలీసులు లక్ష్మీ కోసం గాలిస్తున్న నేపథ్యంలో, ఆమె టీవీ ప్రసారాల్లో కనిపించగానే రాజస్థాన్ పోలీసులు స్పందించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను చెన్నైకి తరలించి, అక్కడి నుంచి రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఈ పరిణామంతో కిరణ్ రాయల్ కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు ఇందులో తప్పు ఎవరిది? కిరణ్ రాయల్ నిజంగానే మోసం చేశారా? లేక లక్ష్మీ తనపై ఉన్న కేసులను దాచిపెట్టి ఆయనను దోపిడీ చేసేందుకు ప్రయత్నించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.