మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీకి సంబంధించి ఆయనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ పిలుపు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి, రాజకీయాలకు గుడ్ బై చెప్పి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. అయితే, ఆయనను పాత కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.
కాకినాడ సీ పోర్టు వాటాల వ్యవహారంలో కె.వి. రావును బెదిరించి, అక్రమంగా పోర్టును తన బంధువులకు కట్టబెట్టారనేది విజయసాయిరెడ్డిపై ప్రధాన ఆరోపణ. ఈ కేసులో గతంలోనూ సీఐడీ ఆయన్ను విచారించింది. ఆ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి, ఈసారి విచారణకు హాజరై ఎలాంటి విషయాలు వెల్లడిస్తారోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
గతంలో సీఐడీ విచారణ అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కేసు గురించి ఎలాంటి సమాచారం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన తెలిపారు. ఇప్పుడు మరోసారి, ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేయడం గమనార్హం. ఈ కేసులో విజయసాయిరెడ్డితో పాటు మొత్తం ఆరుగురిపై కేసు నమోదైంది.
విజయసాయిరెడ్డి ప్రధానంగా వైవీ సుబ్బారెడ్డిపైనే ఆరోపణలు చేస్తున్నారు. కాకినాడ సీ పోర్టు వాటాల బదిలీ వెనుక వైవీ సుబ్బారెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. కె.వి. రావుతో వైవీ సుబ్బారెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండేవని, ఈ మొత్తం వ్యవహారం విక్రాంత్ రెడ్డి చూసుకున్నారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, గతంలో లిక్కర్ స్కాం గురించి కూడా విజయసాయిరెడ్డి మీడియా ముందు సంచలన విషయాలు వెల్లడించారు. కాకినాడ సీ పోర్టుతో పాటు లిక్కర్ స్కాంలోనూ తన పాత్ర లేదని, జగన్ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల ఇబ్బందులు పడి తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యక్తులను నమ్ముకుంటే జగన్మోహన్ రెడ్డికి నష్టమేనని కూడా ఆయన హెచ్చరించారు. వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారి తీరు వల్లే తాను పార్టీని వీడాల్సి వచ్చిందని ఆయన గతంలో చెప్పారు.
ఈ నెల 25న విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో విచారణ సమయంలోనే అధికారులు మరోసారి రావాల్సి ఉంటుందని ఆయనకు సూచించారట. ఈసారి విచారణకు హాజరైతే విజయసాయిరెడ్డి ఎవరి పేర్లు బయటపెడతారు? మీడియా ముందు ఎలాంటి సంచలన విషయాలు వెల్లడిస్తారనేది ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి కూటమి ట్రాప్‌లో ఉన్నారని, ఆయన తప్పకుండా సంచలన విషయాలు బయటపెట్టే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. అయితే, ఇందులో ఎంత నిజముందో వేచి చూడాలి.