నెల్లూరు జిల్లా రాజకీయ వాతావరణం మళ్లీ ఉద్రిక్తతకు గురైంది. జిల్లా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై హత్య బెదిరింపులు రావడం సంచలనం రేపుతోంది. ఈనెల 17న ఓ వ్యక్తి మాస్క్ ధరించి నెల్లూరులోని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికొచ్చి భద్రతా సిబ్బందికి లేఖ అందజేశాడు. ఆ లేఖలో “రూ.2 కోట్లు ఇవ్వకపోతే ప్రశాంతి రెడ్డిని చంపేస్తాం” అని హెచ్చరిక రాసి ఉండటంతో కలకలం చెలరేగింది.
ఇప్పటికే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరుసగా ఎమ్మెల్యేలపై బెదిరింపులు రావడం జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠను పెంచుతోంది.
ఇటీవలే ప్రశాంతి రెడ్డి – మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరగడంతో ఉద్రిక్తత పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ హత్య బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు, వారి వద్ద లభించిన మొబైల్ ఫోన్లను సీజ్ చేసినట్లు సమాచారం. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు.
నెల్లూరులో జరుగుతున్న ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో మరింత రాజకీయ కలకలం రేపే అవకాశం కనిపిస్తోంది.