పోసాని అరెస్ట్ కు ముందు అసలు ఏం జరిగిందంటే?

ప్రముఖ నటుడు, దర్శకుడు, రచయిత పోసాని కృష్ణ మురళిని బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హైదరాబాదులోని రాయదుర్గం ప్రాంతంలోని మై హోమ్ భుజ అపార్ట్‌మెంట్‌లో అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడకు తరలించి, గురువారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. వైద్య పరీక్షల అనంతరం ఆయనను విచారణ ఖైదీగా జైలుకు పంపే అవకాశం ఉంది.

అరెస్టుకు ముందు పోసాని కృష్ణ మురళికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన ఆరోగ్యం బాగోలేదని, ముందుగా హాస్పిటల్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకుని పోలీసులు కోరిన మేరకు సహకరిస్తానని పోసాని విజ్ఞప్తి చేశారు. అయితే పోలీసులు, తాము అతడిని అరెస్ట్ చేయడానికి అన్ని అనుమతులు ఉన్నాయని, సరైన ఆధారాలతోనే ఈ చర్య చేపట్టామని స్పష్టం చేశారు. ఫిర్యాదులు అందిన నేపథ్యంలో, ఆయన ఎక్కడ ఉన్నా అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు తెలిపారు.

పోసాని కుటుంబ సభ్యులు ఈ ఘటనను తమ ఫోన్లలో వీడియో తీసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని ఆపారు. అనంతరం పోసాని కృష్ణ మురళిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అపార్ట్‌మెంట్ పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే, పోసాని అరెస్టుకు ముందు పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగిందని సమాచారం. “మీరు ఎవరో నాకు తెలియదు, నా ఇంటికి ఎందుకు వచ్చారో తెలియదు. మీతో నేను ఎందుకు రావాలి?” అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. కృష్ణ మురళి తీరును చూసి పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందని సమాచారం.

ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ, పోసాని పోలీసులతో గొడవ పెట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. నోటీసులు ఇచ్చినప్పటికీ, తీసుకోవడానికి ఆయన నిరాకరించారని పేర్కొన్నారు. అదనంగా, పోలీసులపై అభ్యంతరకరమైన భాషలో వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు.

పోసాని భార్య కూడా ఈ ఘటనపై స్పందించారు. “పోలీసులు రాత్రి మా ఇంటికి వచ్చి గందరగోళం సృష్టించారు. ఆయనకు అన్నం తినడానికి కూడా సమయం ఇవ్వలేదు. ఆయన హాస్పిటల్ వెళ్తానని చెప్పినా, వినిపించుకోలేదు. ఆయన 66 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో ఉన్నా, పోలీసులు అతనిని వదలలేదు,” అని ఆమె వాపోయారు.

ఈ అరెస్టుకు ప్రధాన కారణంగా, పోసాని గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలే కారణమని పోలీసులు చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం హయంలో ఆయన ఏపీ ఎఫ్డివిడిసి చైర్మన్‌గా పనిచేశారు. అయితే, ఆ తర్వాత నారా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఆయనపై ఫిర్యాదులు అందాయని, అందువల్లే అరెస్ట్ చేసినట్లు ఓబులవారిపల్లె పోలీసులు వెల్లడించారు.

గురువారం ఉదయం పోసాని కృష్ణ మురళిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చే అవకాశం ఉంది.