ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత ఆసక్తికరంగా మారాయి. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి (ఘన విజయం సాధించడానికి కాపు, కమ్మ సామాజిక వర్గాల మద్దతుతో పాటు బీసీల అండ కూడా ప్రధాన కారణమైంది. మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి సాంప్రదాయకంగా రెడ్డి, దళిత ఓటు బ్యాంక్ బలంగా ఉంది. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఈ వర్గాల్లో వచ్చిన చిన్నపాటి చీలిక కూడా పార్టీ పరాజయానికి ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు.
ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కాపు సామాజిక వర్గం మద్దతు అత్యంత కీలకం. ఈ నేపథ్యంలో వైసీపీ ఇప్పుడు కాపు ఓట్లలో చీలిక తేవాలని, తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దళిత వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. దళిత మహాసభల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాపులు, దళితులు చేతులు కలిపితే రాజ్యాధికారం తప్పకుండా దక్కుతుందని వ్యాఖ్యానించారు.
సునీల్ కుమార్ వ్యాఖ్యలతో పాటు, డిప్యూటీ సీఎం పదవిని జడ శ్రవణ్ కుమార్ లాంటి నేతలు తీసుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న జడ శ్రవణ్ కుమార్, క్రమేపీ వైసీపీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తున్నారు. అంతేకాక ఐపీఎస్ సునీల్ కుమార్ సైతం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేశారు.
ఈ ఇద్దరు ప్రముఖుల ప్రస్తావన, కాపు-దళిత ఐక్యత పిలుపు వెనుక వైసీపీ ప్రయోజనాలు ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. కూటమికి అండగా ఉన్న కాపుల్లో చీలిక తీసుకురావడానికి, కమ్మ సామాజిక వర్గం కాపులపై దాడులకు పాల్పడుతోందని ప్రచారం చేస్తున్న వైసీపీ, ఇప్పుడు దళిత కార్డును ఉపయోగించి తన ప్రయత్నాలను మరింత బలోపేతం చేయాలని చూస్తోంది.
కుల సమీకరణలతోనే రాజకీయం చేస్తూ వచ్చిన వైసీపీ, ఇప్పుడు జనసేనకు, కూటమికి అండగా నిలిచే కాపులను డైవర్ట్ చేయగలిగితే, మిగతా వర్గాల మద్దతుతో తిరిగి అధికారంలోకి రావచ్చని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. గతంలో టీడీపీ హయాంలో ఉన్న కాపు రిజర్వేషన్ ఉద్యమం వైసీపీ వచ్చాక ఆగిపోవడం, ఇప్పుడు కాపు-దళిత ఐక్యత డిమాండ్ తెరపైకి రావడం వెనుక బలమైన రాజకీయ ఎత్తుగడ దాగి ఉంది.


