ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై జరిగిన చర్చలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ను “చెడ్డోడు”గా.. ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను “మంచోడు”గా ఎలా చూపుతున్నారని ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ అసహనం ప్రశ్నల రూపంలో కాకుండా వైసీపీ తరఫున వచ్చిన నేతలను మాట్లాడనీయకుండా వ్యక్తమవడం గమనార్హం.
చర్చ జరుగుతున్నంతసేపు యాంకర్ స్వరం, హావభావాలు, పదజాలం తటస్థతను కోల్పోయాయని విమర్శకులు అంటున్నారు. ఒకవైపు “జర్నలిజం” అని చెప్పుకుంటూనే మరోవైపు స్పష్టంగా ఒక రాజకీయ పార్టీకి మద్దతుగా వ్యవహరించడం యెల్లో మీడియా లక్షణమంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
ఈ డిబేట్‌లో ముఖ్యంగా వినిపించిన వాదన ఏమిటంటే “మన యజమాని మాట్లాడితే రెండు రాష్ట్రాల సామరస్యం కోసం.. ఇతరులు అదే మాట మాట్లాడితే ఆస్తులు కాపాడుకోవడం కోసం!” ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలే మీడియా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే అంశాన్ని, ఒకే మాటను ఎవరు చెప్పారన్న ఆధారంగా అర్థం మార్చడం జర్నలిజానికి తగదని వారు అంటున్నారు.
డిబేట్ మొత్తం సమయంలో టీడీపీకి అనుకూలంగా యాంకర్ వ్యవహరించిన తీరు “పోతురాజులా ఊగిపోయాడు” అన్న విమర్శలకు దారి తీసింది. చర్చకు పిలిచిన అతిథులను సమానంగా మాట్లాడనీయకుండా వారి వాదనలను మధ్యలోనే అడ్డుకోవడం వల్ల ఇది డిబేట్ కంటే రాజకీయ ప్రసంగంలా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇలాంటి డిబేట్లు చూసే సామాన్య ప్రేక్షకుల మనసులో ఒకే ప్రశ్న.. మీడియా నిజంగా ప్రజల కోసం పనిచేస్తుందా? లేక రాజకీయ పార్టీల కోసం?
తటస్థత, సమతుల్యతే జర్నలిజం బలం. అది కోల్పోతే చానెల్ ఎంత పెద్దదైనా, యాంకర్ ఎంత ఫేమస్ అయినా ప్రజల నమ్మకం దూరమవుతుందన్న నిజాన్ని మీడియా గుర్తించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన మరోసారి స్పష్టంచేసింది.


