ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న యోగా టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం ఎదుట యోగాసనాలు చేస్తూ నిరసన తెలిపారు. “బాబుకు ‘యోగా’ ట్రీట్‌మెంట్” అంటూ వారు ఈ ఆందోళనకు దిగారు.
పాఠశాలల్లో పనిచేస్తున్న 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. అంతేకాకుండా, తమను యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. యోగా టీచర్ల సమస్యలను వినకుండానే పోలీసులు వారిని అక్కడి నుండి పంపించివేసినట్లు నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యోగా టీచర్లు కోరుతున్నారు.