అమెరికాలో సినిమాలు పంపిణీ చేసే యార్క్ సినిమాస్ ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది, ఇందులో భద్రతా కారణాల వల్ల “ఓజీ” సినిమా యొక్క అన్ని ప్రదర్శనలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
యార్క్ సినిమాస్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో “ఓజీ” చిత్రం యొక్క పంపిణీకి సంబంధించిన వివిధ సాంస్కృతిక, రాజకీయ శక్తులు ప్రజల భద్రతకు, రక్షణకు సంభావ్య ప్రమాదాన్ని సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే ఓజీ ప్రదర్శలను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ నిర్ణయం వల్ల కలిగిన అసౌకర్యానికి యార్క్ సినిమాస్ క్షమాపణలు కోరింది.
ముందుగానే టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి పూర్తిగా రీఫండ్ చేస్తామని కూడా తెలిపింది. తమకు, తమ ఉద్యోగులకు, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది.
యార్క్ సినిమాస్ ప్రకారం, “ఓజీ” పంపిణీదారు, దానితో సంబంధం ఉన్న వ్యక్తులు భవిష్యత్తులో వచ్చే దక్షిణాసియా చిత్రాల ఆర్థిక విలువను కృత్రిమంగా పెంచడానికి అమ్మకపు సంఖ్యలను పెంచాలని యార్క్ సినిమాస్‌ను కోరారు. ఇది ఉత్తర అమెరికాలో దక్షిణాసియా చిత్ర పరిశ్రమపై ఎక్కువ నియంత్రణ సాధించడానికి జరుగుతున్న ప్రయత్నంగా యార్క్ సినిమాస్ భావిస్తోంది.
ఈ వ్యక్తులు సామాజిక స్థితి, రాజకీయ అనుబంధాల ఆధారంగా దక్షిణాసియా సమాజాలలో సాంస్కృతిక విభజనలను కూడా సృష్టిస్తున్నట్లు యార్క్ సినిమాస్ ఆరోపించింది.
తాము అనైతిక వ్యాపార పద్ధతుల్లో పాల్గొనడానికి నిరాకరిస్తున్నామని, దక్షిణాసియా సమాజంలోని అన్ని వర్గాలను ప్రోత్సహిస్తామని యార్క్ సినిమాస్ స్పష్టం చేసింది.