రాష్ట్రంలో మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ఆయన తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
మెడికల్ కాలేజీల టెండర్లకు ఎవరూ రాకపోవడంపై ప్రభుత్వం ఆందోళన చెందడం పట్ల జగన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “టెండర్లకు ఎవరూ రాకపోతే సంతోషించాలి కానీ, ప్రభుత్వం ఎందుకు బాధపడుతోంది?” అని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా పీపీపీ మోడల్ పేరుతో జరుగుతున్న వ్యవహారాన్ని ఆయన ఎండగట్టారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే లక్ష్యంతో తాము చేపట్టిన అభివృద్ధిని, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూర్చేలా మార్చడంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే ఇలాంటి నిర్ణయాలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
తాను అధికారంలోకి వస్తే ప్రైవేటు మెడికల్ కాలేజీ టెండర్లను రద్దు చేస్తానని జగన్ ప్రకటించడంతోనే ఎవరూ టెండర్ కూడా వేయడం లేదు. దీంతో కూటమి ప్రభుత్వానికి అవమానంగా మారింది. అందుకే జగన్ పవర్ ఏంటో తేలిపోయింది. జగన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణపై మున్ముందు ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.


