ఎంపీపీ ఉప ఎన్నికల్లో చోటుచేసుకున్న ఘటనలపై మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని దారుణంగా ఖూనీ చేశారని, ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా మార్చారని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో స్పందించారు.
చిన్న ఎంపీపీ ఎన్నికలోనే ఇలాంటి అప్రజాస్వామిక ఘటనలు జరగడం, కూటమి ప్రభుత్వ తీవ్ర దురహంకారాన్ని, ప్రమాదకర స్వభావాన్ని బయటపెడుతోందని జగన్ అన్నారు. దేశానికి ప్రజాస్వామ్యంపై నీతులు చెప్పే సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అరాచక, ఆటవిక రాజ్యంగా మార్చారని విమర్శించారు.
ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు ఎంపీపీ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలపై దాడులు జరిగాయని, ఓ మహిళా ఎంపీటీసీ తీవ్రంగా గాయపడగా, ఒకరిని కిడ్నాప్ చేశారని జగన్ ఆరోపించారు. మరోవైపు రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలంలో కూడా ఎంపీటీసీలను నిర్బంధించి ఓటు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు.
ఈ ఘటనలన్నింటిలో పోలీసులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ చేతిలో కీలుబొమ్మలుగా మారారని, ఎన్నికల అధికారులు మౌన ప్రేక్షకుల్లా వ్యవహరించారని జగన్ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలే విఫలమవుతున్నాయని, అధికార దుర్వినియోగం ఎంత తీవ్రంగా ఉందో ఇవే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.


