రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమవుతోందా? తాజాగా వైఎస్ షర్మిల – ఆమె సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య రాజీ కుదిరిందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలి కాలంలో షర్మిల జగన్‌పై విమర్శలు తగ్గించడం, కూటమిపై దాడి పెంచడం, కాంగ్రెస్‌లో యాక్టివిటీ తగ్గించడమే ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది.
తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత కుటుంబంలో చీలికలు వచ్చాయి. ఆస్తుల వివాదం, రాజకీయ భేదాభిప్రాయాలతో సోదర–సోదరి దూరమయ్యారు. తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రయోగం వర్కౌట్ కాకపోవడం, 2024 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ప్రభావం చూపించలేకపోవడం తర్వాత పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్‌ఆర్ పాత సన్నిహితులు రంగంలోకి దిగి, జగన్–షర్మిల మధ్య మధ్యవర్తిత్వం నడిపినట్లు సమాచారం. బెంగళూరులో ఉన్న జగన్‌తో, హైదరాబాద్‌లో ఉన్న షర్మిలతో వేర్వేరుగా చర్చలు జరిపి, చాలా అంశాలకు పరిష్కార మార్గం చూపారట. దాంతో ఇద్దరూ రాజకీయంగా కలిసే దిశగా అంగీకరించారని టాక్.
ఇది నిజమైతే ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు బాట పడినట్టే. కుటుంబ ఐక్యత రాజకీయంగా ఎంతవరకు ఫలిస్తుంది? అన్నది మాత్రం వేచి చూడాల్సిందే.


