ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు ప్రజలతో ప్రభుత్వాన్ని కలిపిన బలమైన వంతెనగా నిలిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నియమించబడగా, వారు పథకాలు అందజేయడం, పేదల సమస్యలు పరిష్కరించడం వంటి పనులు చేశారు.
ఈ క్రమంలో ప్రజల్లో వైసీపీకి విశ్వాసం పెరిగింది. 2024 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయినా, దాదాపు 40 శాతం ఓట్లు దక్కడం వెనుక ప్రధాన కారణం వాలంటీర్లే. పేదలతో మమేకమై పని చేసిన వారు, వైసీపీకి చివరి వరకు మద్దతుగా నిలిచారు.
అయితే కొత్త కూటమి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించకపోవడం, వైసీపీ కూడా వారిని పట్టించుకోకపోవడం వల్ల వాలంటీర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. జగన్ మానస పుత్రికగా భావించిన ఈ వ్యవస్థ ఇప్పుడు మసకబారుతున్నట్టు కనిపిస్తోంది.


