వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత ఎవరు? అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఇప్పటివరకు జగన్ చుట్టూ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి కీలక నేతలు రక్షణ వలయంలా నిలిచారు. కానీ ఇప్పుడు కొందరు నేతలు పార్టీకి దూరమయ్యారు, మరికొందరు కేసుల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో జగన్ తన సొంత కుటుంబ సభ్యురాలైన భార్య భారతి రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు ప్రచారం సాగుతోంది.
జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఒకప్పుడు ఆయనకు అండగా నిలిచినా.. ఇప్పుడు ఇద్దరూ దూరమయ్యారు. విజయసాయిరెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడంతో జగన్ మరింత ఒంటరిగా మారినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతి రెడ్డి ఇప్పటికే పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ పార్టీ పరిస్థితులపై అవగాహన పెంచుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి.
ఈ పరిణామాలతో వైసీపీ నెంబర్ 2 స్థానాన్ని భవిష్యత్తులో భారతి రెడ్డి చేపట్టే అవకాశం ఉందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.