వైసీపీ నేత, మంత్రి ఆర్.కె. రోజాపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇంటర్వ్యూలో బండారు సత్యనారాయణ చెప్పిన ప్రకారం “రోజాపై నేను చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ స్వయంగా నన్ను ఒక హోటల్‌లో అందరి ముందు మెచ్చుకున్నారు. ‘ధైర్యంగా మాట్లాడావు’ అంటూ కౌగిలించుకున్నారు. అక్కడ గంటా శ్రీనివాస్ రావు, పల్లా శ్రీనివాస్ రావు, వెలగపూడి రామకృష్ణరావు, కన్నబాబు వంటి పలువురు నేతలు కూడా ఉన్నారు,” అని బండారు తెలిపారు.
ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “ఒక మహిళా నేతపై బూతులు తిట్టిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నట్లయితే, అది ఘోరమైన విషయం. దానికి మించిన దురదృష్టం, ఛండాలం ఇంకొకటి ఉండదు,” అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కొంతమంది నెటిజన్లు “రోజాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యక్తిని మెచ్చుకోవడం అంటే మహిళా గౌరవానికి అవమానం” అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. పవన్ బయట మహిళలకు గౌరవం అంటూ వెనుకాల ఇలా ప్రవర్తిస్తాడా? అంటూ మండిపడుతున్నారు.
ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ వైఖరిపై దాడి ప్రారంభించారు. “మహిళా గౌరవం గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తే ఆయన నైతిక హక్కే లేదు,” అంటూ వైసీపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు.
మొత్తానికి బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు రాజకీయ వాతావరణాన్ని మరోసారి వేడెక్కించాయి. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ నుంచి స్పష్టత రానిదే రాజకీయ వేడి తగ్గేలా లేదు.