తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్రాల రాజకీయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి సీఎం. ఆ పార్టీకి ఎంఐఎం ఇప్పటికే మద్దతు తెలిపింది. మరోవైపు బీఆర్ఎస్‌కు వైయస్సార్ కాంగ్రెస్ బహిరంగ మద్దతు ఇస్తోంది. జగన్-కేసీఆర్ స్నేహం ఈ ఎన్నికల్లోనూ కొనసాగుతోంది.
ఇక టిడిపి, జనసేన వైఖరి ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, రేవంత్ మధ్య స్నేహం అందరికీ తెలిసిందే. గత ఎన్నికల్లో టిడిపి తటస్థంగా ఉండడం వల్ల కాంగ్రెస్‌కు పరోక్ష లాభం దక్కిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూడా టిడిపి నేతలు కాంగ్రెస్ పక్షాన సానుభూతిగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
జూబ్లీహిల్స్‌లో సెటిలర్స్, కమ్మ, రెడ్డి వర్గాల ప్రాబల్యం ఎక్కువ. ఏపీ మూలాలు ఉన్న ఓటర్లు ఇక్కడ కీలకపాత్ర పోషించనున్నారు. వైసీపీ అనుకూలులు బీఆర్ఎస్ వైపు మొగ్గుతుంటే, టిడిపి-జనసేన అభిమానులు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వొచ్చు.
అందుకే ఈ ఎన్నికలో తెలంగాణ రాజకీయాల కంటే ఏపీ పార్టీల వ్యూహాలు, మైత్రులు, విరోధాలే ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశాలుగా మారాయి.


