ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన అంశంపై మరోసారి రాజకీయ చర్చలు చెలరేగుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ విజయంతో కేంద్రం ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా వేగంగా అడుగులు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ క్రమంలో జమిలీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజనపై కూడా కేంద్రం దృష్టి పెట్టిందని సమాచారం.
ఏపీలో 50 కొత్త అసెంబ్లీ స్థానాలు?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. విభజన సమయంలోనే రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వుంటుందని కేంద్రం ప్రకటించినా, అది ఇంతవరకు అమలు కాలేదు. ఇప్పుడు రాజకీయంగా అనుకూల వాతావరణం ఉండడంతో—ముఖ్యంగా టిడిపి ఎన్డీఏలో కీలక భాగస్వామి కావడంతో—ఏపీలో మరో 50 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉన్నట్టు చర్చ సాగుతోంది. దీంతో అసెంబ్లీ బలం 225 వరకూ పెరగొచ్చు.
అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా 5 నుంచి 7 వరకు పెరగొచ్చని అంచనా.
ఈ మార్పులతో పొత్తులో సీట్లు కోల్పోయిన నేతలకు కొత్త అవకాశాలు లభించే ఛాన్స్ ఉండటంతో, రాజకీయంగా భారీ ఆసక్తి నెలకొంది.
జనగణన లేకున్నా పునర్విభజన?
దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదాపడింది. జనగణన పూర్తికాకపోతే పునర్విభజన సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నా, రాజ్యాంగ పరంగా ప్రభుత్వానికి అవసరమైతే ఎప్పుడైనా నియోజకవర్గాల మార్పులు చేయొచ్చని నిపుణుల వాదన.
అందుకే ఇప్పుడు జనగణన లేకుండానే పునర్విభజన చేపట్టే అవకాశం గురించి కూడా చర్చ సాగుతోంది.
బిజేపీకి పెద్ద ప్రయోజనం
పార్లమెంట్ సీట్లు పెరిగితే దాన్ని బిజెపి భారీ అవకాశంగా చూస్తోంది. ఇప్పటికే ఏపీ నుంచి ఆరు ఎంపీ సీట్లు పొత్తులో భాగంగా పొందిన బిజెపి, భవిష్యత్తులో మరింత బలం పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు రాష్ట్రంలో పటిష్ట స్థానం కోరుకుంటే, బిజెపి కేంద్రంలో బలోపేతం కావాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ పరస్పర ప్రయోజనాల దిశగా కలిసి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనసేన కూడా పూర్తి సహకారానికి సిద్ధంగా ఉంది.
పరిస్థితి చూస్తుంటే ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక కేంద్రం ఎప్పుడు అధికారిక నిర్ణయం తీసుకుంటుందన్నదే ప్రధాన ప్రశ్న.

