రాజధాని అమరావతి విషయంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి యాంకర్ వెంకటకృష్ణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వారికి ఇవ్వాల్సిన పరిహారం సైతం సరిగా అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఏబీఎన్ లైవ్ కార్యక్రమంలో వెంకటకృష్ణ మాట్లాడుతూ, అమరావతి విషయంలో మంత్రి నారాయణ తీసుకుంటున్న చర్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “అమరావతిని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,” అని స్పష్టం చేస్తూ, “భూములు ఇచ్చిన రైతులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వడం లేదు,” అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
“ఉద్దేశపూర్వకంగా భూములిచ్చిన రైతులకు… ఇవ్వని రైతుల పొలాల్లో పట్టాలు ఎలా ఇస్తారంటూ” వెంకటకృష్ణ ప్రశ్నించారు. రైతులకు న్యాయం జరగడం లేదని, వారి సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.
రైతుల సమస్యల కంటే, వారికి న్యాయం చేయడం కంటే మంత్రి నారాయణ కానీ, కూటమి ప్రభుత్వం కానీ “ఊడపొడిచేది ఏముంది?” అంటూ ఘాటుగా విమర్శించారు. రాజధాని కోసం త్యాగాలు చేసిన అమరావతి రైతుల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏబీఎన్ వెంకటకృష్ణ తన లైవ్ కార్యక్రమంలో “కడిగేశారు.” ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా అమరావతి రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


