అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టీడీపీ ఎంపీలకే, గుత్తేదారులకే కమిషన్ వేధింపులు తప్పడం లేదన్న ఆరోపణలు తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో చోటుచేసుకున్న తాజా ఘటన టీడీపీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
అనంతపురం జిల్లాలో రూ.7 కోట్ల విలువైన పైప్‌లైన్ టెండర్ పనులను టీడీపీ ఎంపీకి సంబంధించిన గుత్తేదారు దక్కించుకున్నాడు. అయితే ఈ పనుల్లో నుంచి 10 శాతం కమిషన్ ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ ఎమ్మెల్యే నేరుగా గుత్తేదారికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. మొదట గుత్తేదారు తాను టీడీపీ ఎంపీ మనిషినని చెప్పినా, దానిని లెక్కచేయని ఎమ్మెల్యే తమ్ముడు నేరుగా ఎంపీకే ఫోన్ చేసి కమిషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో తీవ్రంగా అసహనానికి గురైన ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇదే అంశంపై ఎమ్మెల్యే మరింత దబాయింపులకు దిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “అధిష్టానానికే ఫిర్యాదు చేస్తావా? ఇక్కడ మేమే అధిష్టానం. నాదే రాజ్యం. నన్నెవడు ఏం చేయలేడు” అంటూ ఎమ్మెల్యే బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇంతటితో ఆగకుండా, 10 శాతం కమిషన్ ఇవ్వకపోతే పనులకు సంబంధించిన సామాగ్రిని ఎత్తుకుపోతామని కూడా హెచ్చరించినట్లు గుత్తేదారు వర్గాలు చెబుతున్నాయి. అధికార పార్టీ ఎంపీకే స్థానిక ఎమ్మెల్యేల నుంచి ఈ స్థాయి వేధింపులు ఎదురవుతున్నాయంటే, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందని విమర్శకులు అంటున్నారు.
అవినీతి రహిత పాలన, పారదర్శకత అని ఎన్నికల సమయంలో నినాదాలు చేసిన టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కమిషన్ల రాజకీయాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని చెబుతుంటే, మరోవైపు అధికార పార్టీలోనే నేతల మధ్య కమిషన్ల కోసం పోటీ జరుగుతోందన్న ఆరోపణలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి.
ఈ వ్యవహారంపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, నిజంగా చర్యలు తీసుకుంటుందా? లేక అంతర్గతంగా సర్దిచెప్పి మౌనం పాటిస్తుందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.


