ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సాధారణంగా తనదైన శైలిలో ప్రత్యర్థులపై విమర్శలు చేసే రఘురామ, ఈసారి ఏకంగా జర్నలిస్టులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ఆయన వాడిన భాష, చేసిన విమర్శలు నాగరిక సమాజం తలదించుకునేలా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒక సందర్భంలో మాట్లాడుతూ, తనను లేదా తన పార్టీని విమర్శించే జర్నలిస్టులపై రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యంగా ‘సాయి’ అనే జర్నలిస్టును ఉద్దేశించి మాట్లాడుతూ అత్యంత ఘాటైన పదజాలాన్ని ఉపయోగించారు. జర్నలిస్టులను ఉద్దేశించి “బ్రోకర్ నా కొడుకు”, “పిచ్చనా కొడుకుల్లారా” వంటి బూతు పదాలతో విరుచుకుపడ్డారు. జర్నలిస్టులు వారి కులంలో “చెడపుట్టారు” అంటూ కులపరమైన వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. వైసీపీ , సాక్షి యాజమాన్యం నుంచి సదరు జర్నలిస్టులకు పేమెంట్లు అందుతున్నాయని, అందుకే వారు టీడీపీని తిడుతున్నారని ఆయన ఆరోపించారు.
డిప్యూటీ స్పీకర్ పదవి అనేది అత్యంత గౌరవప్రదమైనది. సభను హుందాగా నడపాల్సిన వ్యక్తి, సమాజానికి నాలుగో స్తంభం లాంటి మీడియా ప్రతినిధులపై ఈ స్థాయిలో బూతులతో విరుచుకుపడటంపై మేధావులు మండిపడుతున్నారు. విమర్శలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ, ఇలా వ్యక్తిగత దూషణలకు దిగడం ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయికి తగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రఘురామ వ్యాఖ్యలపై జర్నలిస్ట్ సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జర్నలిస్టులను కించపరిచేలా మాట్లాడటం ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడి చేయడమేనని వారు వాదిస్తున్నారు. తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. అయితే, పదవిలో ఉన్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు సంయమనం పాటించకపోతే, అది వ్యవస్థల పట్ల ప్రజలకు ఉన్న గౌరవాన్ని తగ్గిస్తుంది. రఘురామకృష్ణంరాజు వంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.


