గతంలో RRR సినిమాతో తెలుగు గడ్డకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రదర్శించిన “నటన” చూస్తుంటే, రాష్ట్రానికి మరో ఆస్కార్ ఖాయమని నెటిజన్లు వేళాకోళం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం తరలింపు వ్యవహారంలో ఆయన ప్రదర్శించిన హావభావాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్స్‌ను రాయచోటి నుండి మార్చే అంశంపై మీడియా ముందు మాట్లాడిన మంత్రి, ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. జిల్లా ప్రయోజనాల గురించి చెబుతూ ఆయన కంటతడి పెట్టారు. అయితే, ఈ భావోద్వేగ సన్నివేశం వెనుక జరిగిన కొన్ని ‘రీటేక్’లు ఇప్పుడు బయటకు రావడంతో అసలు రచ్చ మొదలైంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, మంత్రి గారి ప్రదర్శనలో కొన్ని ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. మంత్రి గారు ముందుగా కారు దిగి ముందుకు నడిచారు. అయితే షూటింగ్ సరిగ్గా రాలేదనుకున్నారో ఏమో కానీ, మళ్లీ వెనక్కి వెళ్లి, కారు వెనుక నుండి నడుచుకుంటూ వచ్చి కెమెరాల ముందు డ్రామాను రక్తి కట్టించారు.
మీడియా ముందు ఆయన పెట్టిన కన్నీళ్లు చూసి విపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. “కన్నీళ్లు ఎత్తి పోయడానికి కూడా టెండర్లు పిలిచేలా మంత్రి గారు నటిస్తున్నారు” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మంత్రి గారి నటన ఏ రేంజ్‌లో ఉందంటే.. ఆయనకు ఖచ్చితంగా ఆస్కార్ ఇవ్వాల్సిందే అని ఆయన అభిమానులు (సెటైరికల్‌గా) డిమాండ్ చేసే స్థాయికి చేరింది.
రాయచోటి హెడ్ క్వార్టర్స్ తరలింపుపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే పోరాటం చేయాలి కానీ, ఇలా కెమెరాల ముందు కన్నీళ్లతో హంగామా చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. “మంత్రి గారు సినిమాల్లో ట్రై చేస్తే టాలీవుడ్‌కు గట్టి పోటీ ఇస్తారు” అని కొందరు, “ఇది ప్యూర్ ఆస్కార్ మెటీరియల్” అని మరికొందరు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
రాజకీయాల్లో సెంటిమెంట్ పండించడం కామన్ అయినప్పటికీ, మరీ ఇంత ‘స్క్రిప్టెడ్’ గా వ్యవహరించడం మంత్రి గారికి ఇబ్బందికరంగా మారింది.


