ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసు ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణిస్తూ కొట్టివేసింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట లభించింది.
2014–2019 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో APSSDC ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. ఫేక్ కంపెనీల ద్వారా రూ.371 కోట్ల మేర నిధులు మళ్లించారని అప్పట్లో దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ నేపథ్యంలో 2023 సెప్టెంబర్‌లో చంద్రబాబును అరెస్ట్ చేసి 53 రోజుల పాటు రిమాండ్‌లో ఉంచారు.
అయితే తాజాగా సీఐడీ తుది నివేదిక దాఖలు చేస్తూ నేరానికి సంబంధించిన పటిష్ట ఆధారాలు లేవని పేర్కొనడంతో కోర్టు కేసును కొట్టివేసింది. గతంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన సంస్థే ఇప్పుడు భిన్నంగా వాదించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. అధికార దుర్వినియోగమని వైఎస్సార్సీపీ ఆరోపిస్తుండగా, న్యాయ నిపుణులు కూడా ఈ పరిణామంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

