తెలుగు మీడియా రంగం రోజురోజుకీ విలువలు కోల్పోతుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం నైతికతను తాకట్టు పెడుతోందా? అనే ప్రశ్నలకు మరోసారి బలం చేకూర్చిన ఘటన ఇది.
ఇటీవల TV5 చానెల్లో యాంకర్ సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. తన ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారని, ఇది వ్యక్తిగత దాడి అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే… ఇక్కడ అసలు ప్రశ్న వేరే ఉంది. మీడియా అనేది ప్రశ్నించాలి.అధికారాన్ని నిలదీయాలి.అన్యాయంపై గళమెత్తాలి. కానీ అదే మీడియా ఒక రాజకీయ పార్టీకి వత్తాసు పలికితే… మరో పార్టీని ప్రశ్నిస్తే ‘దాడి’గా భావించాలా? సాంబశివరావు మాటల్లో కనిపించిన అసహనం, ఆగ్రహం చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది.. “విమర్శను భరించే సహనం మీడియాకు ఉందా?” అన్న సందేహం.
ఒకడు చెప్పు తీసుకుని కొడతానంటాడు.. దమ్ముంటే డిబేట్ పెట్టమంటాడు… ఇవి వాదనలేనా? లేక భయపెట్టే హెచ్చరికలా? వైసీపీ మాట్లాడితే తిట్టాలా? టీడీపీకి మద్దతు ఇస్తే ట్రోల్స్ చేయాలా? అంటూ టీవీ5 సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే వ్యక్తిగత దూషణలు ఖచ్చితంగా తప్పే. కానీ రాజకీయ విమర్శను, ప్రజల ప్రశ్నలను కూడా అదే కోవలో పెట్టి “ట్రోల్” అని ముద్ర వేయడం ఎంతవరకు సమంజసం? వైసీపీని ప్రశ్నిస్తే మీడియా మీదపడుతుందా?లేక మీడియా ఒకవైపు నిలబడి ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి చేస్తుందా? అంటూ నెటిజన్లు సైతం సాంబశివరావుకు కౌంటర్ ఇస్తున్నారు.


