అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల తిరుపతి దేవస్థానాలు బోర్డు సభ్యుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూడు పదవుల హడావుడిలో నియోజకవర్గ ప్రజల కనీస అవసరమైన తాగునీటి సమస్యను పట్టించుకునే తీరికే లేదన్న విమర్శలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసహనం వెల్లువెత్తుతోంది.
ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలుకాకముందే తాగునీటి సమస్యలు తారాస్థాయికి చేరాయి. వరుసగా బేగార్లపల్లి, వడ్రపాళ్యం, కొడగార్లగుట్ట, కూగిరినపాళ్యం, జమ్మలబండ, రాళ్లపల్లి గ్రామాల్లో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. “గుక్కెడు నీటికి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి” అంటూ తమ గోడును వెల్లగక్కుతున్నారు.
గత కొన్నిరోజులుగా మడకశిర పట్టణంలో మహిళలు ఖాళీ బిందెలతో బైఠాయించి ఆందోళనలకు దిగుతున్నారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, తమ కన్నీటి కష్టాలు తీర్చే నాథుడే కనిపించడం లేదని వాపోతున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక చోట తాగునీటి కోసం ఆందోళన జరుగుతూనే ఉందని స్థానికులు చెబుతున్నారు.
తాజాగా బోరు మోటర్ చెడిపోవడంతో మడకశిర పట్టణంలోని 18వ వార్డుకు 15 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రతిరోజూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడం, కనిపించిన ప్రతి అధికారిని వేడుకోవడం పరిపాటిగా మారింది. దీంతో రిపబ్లిక్ డే నాడు మహిళలంతా ఖాళీ బిందెలతో రోడ్డెక్కి బేగార్లపల్లి క్రాస్ వద్ద హిందూపురం ప్రధాన రహదారిపై బైఠాయించారు. గంటసేపు నిరసనతో రాకపోకలకు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్‌ఐ లావణ్య అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించి, అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఇది ఒక్క ఘటన కాదు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలంలోని కేజీగుట్ట, కొడగార్లగుట్ట గ్రామాల మహిళలు జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అలాగే మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యంలో, గుడిబండ మండలం ఎస్‌ఎస్ గుండ్లులో కూడా తాగునీటి సమస్యపై మహిళలు రోడ్డెక్కారు.
కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో చిన్నచిన్న సమస్యలకే పరిష్కారం దొరకడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజల మౌలిక అవసరాలపై దృష్టి పెట్టకుండా, అనవసర అంశాలపై ఎమ్మెల్యే ఆర్భాటం ఎక్కువైందని మండిపడుతున్నారు. “మూడు పదవులు మూడే గర్వంగా కాకుండా, మూడు బాధ్యతలుగా భావించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి” అన్న డిమాండ్ ఇప్పుడు మడకశిరలో గట్టిగా వినిపిస్తోంది.


