ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు, మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ప్రకటించారు.
పొత్తూరి వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ “చంద్రబాబు గారికి క్షమాపణలు చెబుతున్నాను. నేను పార్టీకి ఎలాంటి ద్రోహం చేయలేదు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను. కానీ నాకు లభించిన బహుమానం నా ఇల్లు, ఆఫీస్ కూల్చివేయడమే” అని ఆవేదన వ్యక్తం చేశారు.
తన గళం విప్పినందుకు రఘురామకృష్ణంరాజు తనపై ప్రతీకార చర్యలకు దిగారని ఆరోపించారు. “నా ఇల్లు, కార్యాలయం కూల్చి నన్ను జీవచవాన్ని చేశారు. ఉండిలో రఘురామ అరాచక పాలన సాగుతోంది. ఆయన దోపిడీ, దౌర్జన్యాలపై ఉన్న ఆధారాలను త్వరలోనే బయట పెడతా” అని హెచ్చరించారు.
అంతేకాకుండా “నాకు న్యాయం జరిగే వరకు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా పోరాటం ఆగదు” అని స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు చర్యల వల్ల తన కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, తనకు న్యాయం చేయాలని పార్టీ అధినేతను కోరారు.
పొత్తూరి వ్యాఖ్యలతో ఉండి రాజకీయాల్లో కలకలం రేగింది. టీడీపీ అంతర్గతంగా ఈ వ్యవహారం చర్చనీయాంశమవగా.. పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రఘురామకృష్ణంరాజు వర్గం నుంచి స్పందన రావాల్సి ఉంది.
https://x.com/Telugufeedsite/status/2027438957022367855?s=20


