ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగుతోంది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు మరియు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం కోసం ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కృష్ణ-గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపులో కూటమికి ఊహించని షాక్ తగిలింది. కూటమి నేరుగా అభ్యర్థిని నిలపకపోయినప్పటికీ, ఏపీటీఎఫ్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. అయితే, మొదటి రౌండ్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మ తన ప్రధాన ప్రత్యర్థి పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడుకంటే వెనుకబడ్డారు.
ఈ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ పోటీ చేయగా, పిఆర్టియు నుంచి మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, యుటిఎఫ్ తరఫున విజయ గౌరీ బరిలో నిలిచారు. త్రిముఖ పోటీలో హోరాహోరీ పోటీ నెలకొంది. కూటమి మద్దతుతో రఘువర్మ విజయం సాధిస్తారని భావించినా, మొదటి రౌండ్ ఫలితాలు భిన్నంగా ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
తొలి రౌండ్లో మొత్తం 20,783 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 19,813 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. ఈ లెక్కింపులో గాదె శ్రీనివాసుల నాయుడుకు 7,210 ఓట్లు రాగా, రఘువర్మ 6,835 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పిడిఎఫ్ అభ్యర్థి విజయ గౌరీ 5,810 ఓట్లను సంపాదించారు.
ఇప్పటివరకు ఎవరికీ గెలిచేంత ఆధిక్యం లభించలేదు. రెండో రౌండ్ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలనుంది. త్రిముఖ పోటీ నేపథ్యంలో గెలుపెవరిదో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.