గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు సమాచారం. ప్రస్తుతం విజయవాడ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీ, గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి అత్యవసరంగా మారడంతో జైలు అధికారులు ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇప్పటికే రెండు నెలలుగా జైలులో గడుపుతున్న వంశీ మోహన్, నడుము నొప్పి, కాళ్ల వాపు వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనను తిరిగి జైలుకు పంపారు.
తెలుసుకున్న వివరాల ప్రకారం, 2023 ఫిబ్రవరిలో గన్నవరం టిడిపి కార్యాలయం దాడి ఘటనలో వంశీపై కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్య వర్ధన్ ను కులపరంగా దూషించారన్న ఆరోపణలు ఎదురయ్యాయి. కాబట్టి, కిడ్నాప్ ఆరోపణలపై ఏపీ పోలీసులు వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు ఆయనకు కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో బెయిల్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.
వంశీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంపై కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా జైలులో ఉన్న వంశీకి అనారోగ్యం మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టడంతో కుటుంబం వేచిచూస్తోంది. ముఖ్యంగా హైకోర్టు ఇటీవల ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడం తో పరిస్థితి మరింత సంక్లిష్టమైందని తెలుస్తోంది.