చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే వి.ఎం. థామస్ తిరుమలలో హల్ చల్ చేశారు. శనివారం స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చిన ఆయన, నిబంధనలను ఉల్లంఘించి వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో టీటీడీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టీటీడీ నిబంధనల ప్రకారం, ఎమ్మెల్యే థామస్‌తో పాటు మరో 9 మందికి మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి ఉంది. అయితే, ఆయన తన వెంట వచ్చిన అదనంగా మరో ఆరుగురిని కూడా ప్రోటోకాల్ లైన్‌లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఆరుగురికి వేరే రిఫరెన్స్‌లో సాధారణ వీఐపీ బ్రేక్ టిక్కెట్లు ఉన్నప్పటికీ, వారిని కూడా తనతో పాటు ప్రోటోకాల్ లైన్‌లో అనుమతించేందుకు టీటీడీ సిబ్బంది నిరాకరించారు.
దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే థామస్, టీటీడీ సిబ్బందిపై తిట్ల దండకం అందుకున్నారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపై సైతం రుసరుసలాడారు. చివరికి, తన అనుచరులను బలవంతంగా నేరుగా ఆలయంలోకి తీసుకువెళ్లినట్లు సమాచారం. సిబ్బంది సమాచారం ఇవ్వడంతో డిప్యూటీ ఈవో, విజిలెన్స్ అధికారులు అక్కడికి చేరుకుని ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వారిపై కూడా ఎమ్మెల్యే థామస్ విరుచుకుపడినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ వివాదం పెద్దది కాకుండా టీటీడీ అధికారులు పరిస్థితిని చక్కదిద్ది, ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు. అయినప్పటికీ, అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ చర్చనీయాంశమైంది. https://x.com/JaganannaCNCTS/status/1944344610580664470