మరో మాజీ మంత్రి అరెస్టుకు రంగం సిద్ధమవుతోందా? ముహూర్తం ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని, నందిగాం సురేష్, పేర్ని నాని, జోగి రమేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి వంటి కీలక నేతలపై కేసులు నమోదయ్యాయి. అందులో చాలామంది అరెస్టు కూడా అయ్యారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా చేరారు. ఆమెను సైతం అరెస్టు చేస్తారనే ప్రచారం మొదలైంది. తెరవెనుక ఆమె అరెస్టుపై రకరకాల చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో ఆమె అరెస్టు ఎప్పుడు అన్నదానిపై… శాప్ ఛైర్మన్ స్పష్టతనిచ్చారు.
జగన్ మంత్రివర్గంలో ఆర్కే రోజా రెండున్నరేళ్లుగా పనిచేశారు. పర్యాటక శాఖతో పాటు క్రీడల మంత్రిగా ఉండేవారు. 2024 ఎన్నికల ముందు ‘ఆడుదాం ఆంధ్ర’, ‘సీఎం కప్’ పోటీల నిర్వహణకు సంబంధించి కూటమి ప్రభుత్వం కక్ష్యతో తవ్వి తీసి కేసులు పెట్టించింది. ఇప్పుడు అరెస్టుకు రంగం సిద్ధం చేస్తోంది.
అయితే మాజీ మంత్రి రోజా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అరెస్టు చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికీ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీంతో ఆమెపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తొలుత మహిళ కావడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనని ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇదే అదునుగా రోజా చెలరేగిపోతున్నారు. కూటమి ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నట్టు మూడు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో రోజాను విడిచి పెట్టవద్దని.. తప్పకుండా అరెస్టు చేసి తీరాలని కోరుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం ఆమె అరెస్టుకు సంబంధించి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లాకు చెందిన రవి నాయుడు శాప్ ఛైర్మన్గా ఉన్నారు. నారా లోకేష్కు అత్యంత సన్నిహితుడు కూడా. ఆగస్టు పదిలోగా రోజా అరెస్టు తప్పదని ఆయన ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. దీంతో అరెస్ట్ కాబోయే మాజీ మంత్రుల జాబితాలో రోజా కూడా చేరిపోయారన్నమాట. చూడాలి మరి ఏం జరుగుతుందో.