విశాఖపట్నంలో ఆంధ్రజ్యోతి పత్రికకు కోట్ల రూపాయల విలువైన స్థలం కేటాయింపు వివాదాస్పదంగా మారింది. పరదేశిపాలెంలో సుమారు రూ.10 కోట్ల మార్కెట్ విలువ కలిగిన అర ఎకరాన్ని నామమాత్రపు ధరకు ఆమోద పబ్లికేషన్స్‌కి కేటాయించే ప్రతిపాదన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో చివరి నిమిషంలో టేబుల్ అజెండాగా చేర్చారు.
అయితే, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఇంత కీలకమైన అంశాన్ని ముందస్తు అజెండా లేకుండా ఎలా తెచ్చారో ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మేయర్ శ్రీనివాసరావు కేటాయింపు నిర్ణయాన్ని వాయిదా వేశారు.
గతంలోనూ టీడీపీ ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి తక్కువ ధరకు స్థలం కేటాయించిన ఘటనపై పెద్ద వివాదం రేగిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రయత్నం చేయడం, చివరికి రద్దు కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.