రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి కారణమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలుస్తుందనే ముద్రపడిన ఏబీఎన్ చానెల్‌లో యాంకర్ వెంకటకృష్ణ, ఈ సారి మాత్రం వ్యవసాయ సమస్యలపై నేరుగా సీఎం చంద్రబాబుని నిలదీశారు.
రైతులకు అత్యవసరమైన యూరియా అందకపోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకటకృష్ణ, “70 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. రైతులు క్యూలో నిలబడి చెప్పులు వేసుకుని కొట్టుకుంటున్నారు. బ్లాక్ టిక్కెట్ల కోసం కూడా ఇంత గొడవలు ఉండవు. ఇది ఏంటీ దరిద్రం?” అంటూ బహిరంగంగా నిలదీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
15 ఏళ్ల క్రితం యూరియా కోసం క్యూలు చూసిన తన అనుభవాన్ని గుర్తుచేసుకున్న ఆయన, మళ్లీ అదే పరిస్థితి రావడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. ఏపీతో పాటు తెలంగాణలోనూ రైతులు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సాధారణంగా టీడీపీకి దగ్గరగా ఉంటుందని విమర్శలు ఎదుర్కొనే ఏబీఎన్‌లోనే ఈ తరహా విమర్శలు వినిపించడం విశేషం. ముఖ్యంగా చంద్రబాబుపై నేరుగా ప్రశ్నలు లేవనెత్తడం గమనార్హం. దీని వల్ల రైతు సమస్యల తీవ్రత, ప్రభుత్వాల నిర్లక్ష్యం వెలుగులోకి రావడంతో పాటు, రాజకీయంగా కూడా ఇది హాట్ టాపిక్‌గా మారింది.
మొత్తానికి, రైతుల సమస్యను బహిరంగ వేదికపైకి తీసుకువచ్చిన వెంకటకృష్ణ, మీడియా కూడా అవసరమైన సమయంలో ప్రజల గొంతుకగా మారగలదని నిరూపించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి