ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై స్పష్టత వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శాసనసభ సమావేశాలకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వనంతవరకు సభకు రాబోమని స్పష్టం చేశారు. ఈ నిర్ణయానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రతిపక్ష హోదా లభిస్తేనే సభలో తగినంత సమయం లభిస్తుందని, ప్రజల సమస్యలపై సమర్థవంతంగా పోరాడొచ్చని జగన్ వాదిస్తున్నారు. అయితే, సభకు హాజరైతే వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై అధికారబలంతో ఎదురుదాడి చేసే అవకాశం ఉందని ఆయన అండ్ కో భావిస్తున్నారు. సభలో అవమానాలు ఎదుర్కోవడం కంటే, గైర్హాజరు కావడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారని సమాచారం.
అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజల మధ్య ఉండి, వారి సమస్యలపై గళమెత్తాలని జగన్ నిర్ణయించుకున్నారు. సభకు హాజరైతే కేవలం ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడే అవకాశం వస్తుందని, కానీ ప్రజల మధ్య ఉంటే ఎక్కువ సమయం పాటు ప్రజా సమస్యలను వివరించవచ్చని ఆయన భావిస్తున్నారు. ఇది ప్రజల్లో సానుభూతిని పెంచుతుందని, పార్టీకి భవిష్యత్తులో మంచి ఫలితాలు ఇస్తుందని ఆయన నమ్మకం. ఈ నిర్ణయం ప్రజల్లో కొంత చర్చకు దారితీసినా, దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగానే జగన్ ప్రజాక్షేత్రంలో పర్యటించనున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అధికార కూటమి అసెంబ్లీలో తమ బలాన్ని ప్రదర్శించగా, వైసీపీ ప్రజల మధ్య తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. భవిష్యత్తులో ఈ రెండు వ్యూహాలు ఏ ఫలితాలను ఇస్తాయో వేచి చూడాలి.