ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటలు, వాగ్దానాలు, విమర్శలు కొత్తేమీ కావు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే నాయకులు తమ మాటలను మార్చుకుంటే.. ప్రజల్లో అసహనం సహజం. ప్రస్తుతం హోంమంత్రి అనితక్క పరిస్థితి అలాంటిదే.
టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనితక్క మత్స్యకారుల సమస్యలపై గొంతెత్తారు. విషపూరిత మురికి, రసాయనాలు సముద్రంలో కలవడం వల్ల మత్స్యకారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని.. వారి ఆరోగ్యం పాడవుతోందని, ముఖ్యంగా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారని అనితక్క గళమెత్తారు. ఆ సమస్యను పట్టించుకోని వైసీపీ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ, పెద్ద పెద్ద డైలాగులు చెప్పి మత్స్యకారుల పక్షాన నిలబడతామంటూ బహిరంగంగా హామీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సమస్యపై మత్స్యకారులు ప్రశ్నిస్తే.. అనితక్క మాత్రం రాజకీయాలు చేయవద్దని, గొడవలకు పోవద్దని సలహా ఇస్తున్నారు. సమస్యకు గ్యాస్ కారణమని, దీని గురించి తాము ఏం చేయలేమని తప్పించుకునేలా సమాధానం చెప్పిన అనిత వ్యాఖ్యలు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాయి.
దీంతో అనితక్క పర్యటించిన గ్రామాల్లో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెను నిలదీసి – నాడు మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ? నేడు ఎందుకు నిష్క్రియగా ఉన్నారు? అంటూ ప్రశ్నించారు. చివరికి నిరసనలతో అడ్డుకోవడంతో, తరిమికొట్టిన వాతావరణం ఏర్పడింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకే విధంగా మాట్లాడి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చితే ప్రజలు మన్నించరని అనితక్క పరిస్థితి మరోసారి నిరూపించింది. “నాడు – నేడు” మధ్య తేడా మత్స్యకారుల మనసుల్లో గాఢమైన అసంతృప్తిని మిగిల్చిందనడం అతిశయోక్తి కాదు.