ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ శైలి అంటేనే ఒక ప్రత్యేకమైన మేనరిజం, పదునైన విశ్లేషణ, అంతకుమించి తాను ఇష్టపడే నాయకులపై కురిపించే “ఎలివేషన్ల” వర్షం. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తెలుగు న్యూస్ ఛానెల్స్‌లో డిబేట్ అంటేనే ఒక యుద్ధంలా ఉంటుంది. ముఖ్యంగా ఏబీఎన్ రాధాకృష్ణ మార్క్ జర్నలిజం, యాంకర్ వెంకటకృష్ణ పదునైన మాటలు ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా ఒక చర్చా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పనితీరును, ఆయన వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తుతూ వెంకటకృష్ణ ఇచ్చిన ఎలివేషన్లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా ఏ రాజకీయ నాయకుడైనా విజయం వచ్చినప్పుడో, పండుగ సమయాల్లోనో విదేశీ యాత్రలకు వెళ్లడం లేదా విలాసవంతంగా గడపడం చూస్తుంటాం. కానీ చంద్రబాబు శైలి వేరని వెంకటకృష్ణ అభిప్రాయపడ్డారు.”చంద్రబాబు సెలబ్రేషన్స్ కోసం వెళ్లారని కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడైనా సెలబ్రేషన్స్ చేసుకున్నారా? అసలు ఆయనకు పండుగలే లేవు. జగన్ లాగా పదే పదే దేశం దాటి వెళ్ళే అలవాటు ఆయనకు లేదు.” అని వెంకటకృష్ణ వ్యాఖ్యానించారు.
చంద్రబాబు వ్యక్తిగత జీవితం గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఏడాది పొడవునా కష్టపడుతూనే ఉంటారని, కేవలం సంక్రాంతి పండుగకు మాత్రమే తన సొంతూరైన నారావారి పల్లెకు వెళ్తారని గుర్తు చేశారు. ఆ రెండు రోజులు తప్ప, మిగిలిన 363 రోజులు ప్రజల కోసం, పాలన కోసమే ఆలోచిస్తారని పేర్కొన్నారు.వెంకటకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.”ఇది జర్నలిజమా లేక భజననా?” అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఏది ఏమైనా, ఒక న్యూస్ డిబేట్‌ను తనదైన స్టైల్‌లో ఎలివేషన్లతో రక్తి కట్టించడంలో వెంకటకృష్ణ మరోసారి సక్సెస్ అయ్యారని చెప్పక తప్పదు.


