ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్ యాంకర్ అయిన వెంకటకృష్ణ మరోసారి తన ఛానెల్‌లో తెలుగుదేశం పార్టీ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రోల్స్కు దారితీశాయి. ఆయన టీడీపీని పొగుడుతూ మాట్లాడిన మాటలు, ఆ పార్టీకిచ్చిన ‘హైప్’పై నెటిజన్లు సెటైర్లు వేస్తూ, “ఇంత జాకీలు అవసరమా?” అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
వెంకటకృష్ణ తన కార్యక్రమాల్లో టీడీపీని ప్రశంసిస్తూ చేసిన కీలక వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.. “తెలుగుదేశం ప్రపంచ రాజకీయాలకు ఒక కేస్ స్టడీ.. తెలుగు జాతి కోసం మాత్రమే పుట్టిన పార్టీ… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా వారి కోసం పనిచేసే పార్టీ…” అంటూ పొగడ్తలు కురిపించారు.
“ఉద్దాన పతనాలు ఎదురైనా ప్రపంచంలోని ఏ రాజకీయా పార్టీకి తగ్గకుండా ప్రజల మనసులను చదువుతూ… వారి అవసరాలు తెలుసుకొని గొప్ప రాజనీతిజ్ఞితతో ముందుకెళుతూ… సామాజిక పరిస్థితులను అవపోసన పడుతూ… తనను తాను అప్ గ్రేడ్ చేసుకుంటూ…” టీడీపీ ప్రపంచ రాజకీయాలకు ఒక కేస్ స్టడీగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
వెంకటకృష్ణ టీడీపీని ఇంతగా పొగడడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొందరు “ఏబీఎన్ వెంకటకృష్ణ జాకీలు… లగెత్తండిరోయ్” అనే మీమ్‌ను ట్రెండ్ చేస్తుండగా, మరికొందరు “ఒకే… ఒకే… అర్థమయ్యింది!” అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
టీడీపీకి “ప్రపంచ రాజకీయాలకు కేస్ స్టడీ” అనే బిరుదు ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్, “టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ కూడా ఇంత హైప్ ఇచ్చి ఉండరేమో! ఈ జాకీలు మరీ ఎక్కువయ్యాయి సార్,” అని కామెంట్ చేశారు.
ఏది ఏమైనా వెంకటకృష్ణ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, టీడీపీకి ఇంతగా “హైప్” ఇవ్వడంపై చర్చకు తెరలేపాయి.


