కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య స్నేహపూర్వక క్షణాలు.. కౌగిలింతలు, హిందీలో ప్రశంసలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపైనే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌లో జరిగిన డిబేట్‌లో ఆసక్తికరమైన వాదనలతో వాతావరణం వేడెక్కింది.
డిబేట్‌లో పాల్గొన్న కమ్యూనిస్టు నేత గఫూర్ వ్యాఖ్యలు అయితే సూటిగా, సెటైర్‌తో నిండిపోయాయి. “ఇంత పొగడ్తలు, కౌగిలింతలు అవసరమా? నాయకత్వం అంటే విమర్శనాత్మక దృష్టి ఉండాలి కానీ, అతి ప్రశంసలు కాదు” అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయన మరింతగా మాట్లాడుతూ “ట్రంప్ & మోదీ ఎలా కౌగిలింతలు చేసుకొని పొగుడుకొన్నారో తెలుసుకదా?” అని వ్యంగ్యంగా అన్నారు.
దీనికి ప్రతిగా యాంకర్ వెంకటకృష్ణ స్పందిస్తూ, “రాష్ట్రం ప్రయోజనాల కోణంలో చూస్తే చంద్రబాబు ప్రధాని మోదీని పొగడడం తప్పు కాదు. రాష్ట్రం కోసం మంచి సంబంధాలు కొనసాగించాల్సిందే” అని అన్నారు. అయితే చివర్లో ఆయన కూడా ఒప్పుకున్నట్టుగా “పొగడ్తల డోస్ కొంచం ఎక్కువైంది” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. కొందరు నెటిజన్లు వెంకటకృష్ణ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు “మీడియా కూడా ఇప్పుడు నాయకుల పొగడ్తల పరిమితి గురించి చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మొత్తం మీద, కర్నూలు సభలోని ఆ మోదీ–చంద్రబాబు కౌగిలింతలు కేవలం రాజకీయ క్షణాలకే పరిమితం కాలేక, ఇప్పుడు మీడియా స్టూడియోలలో, సోషల్ మీడియాలో కొత్త వాదనలకు దారితీశాయి.